
పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
మంగళగిరి వద్ద స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
చిత్తూరు, జూలై24(క్విక్ టుడే న్యూస్):
పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలం గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంపుకు అటవీశాఖ అధికారులు తరలించారు. మార్గమధ్యంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏనుగులకు స్వాగతం పలికి ఆహారం అందించారు. మన్యం జిల్లాలో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు ఈ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయగా, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జయంత్, అభిమన్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అటవీశాఖ అధికారి చలపతిరావు తెలిపారు. పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపులను నియంత్రించి పంటలను రక్షించడంలో ఇవి సమర్థంగా పనిచేశాయని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా ఈ కుంకీ ఏనుగులను తీసుకొచ్చినట్లు పేర్కొంటూ, పంటలకు రక్షణ కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.





